ఆయుధాలు వీడి జన స్రవంతిలో కలవాలి..మావోయిస్టులను కోరిన సీపీ

ఆయుధాలు వీడి జన స్రవంతిలో కలవాలి..మావోయిస్టులను కోరిన సీపీ

బెల్లంపల్లి, వెలుగు: మావోయిస్ట్ పార్టీలో కొనసాగుతున్న వారు ఆయుధాలు విడిచి జనజీవన స్రవంతిలో కలవాలని రామగుండం సీపీ, ఐజీ ఎం.శ్రీనివాస్ కోరారు. బుధవారం బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి వెళ్లిన సీపీ అక్కడ మావోయిస్టు జాడి భాగ్య అలియాస్ పుష్ప, ఆమె భర్త జాడి వెంకటి కుటుంబసభ్యులను డీసీపీ భాస్కర్‌తో కలిసి పరామర్శించారు. పుష్ప తల్లి మల్లమ్మ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని వారి కుటుంబ సభ్యులకు దుప్పట్లు, నిత్యావసరాలు అందజేశారు.

సీపీ మాట్లాడుతూ.. జాడి పుష్ప, జాడి వెంకటి 1999లో అజ్ఞాతంలోకి వెళ్లారని, మావోయిస్టు పార్టీలో ఎన్నో ఏండ్లపాటు పనిచేసినా వారు సాధించిందేమీ లేదన్నారు. తమ సిద్ధాంతాలు వీడి లొంగిపోతే, వారి ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని అవసరమైన వైద్య సాయం అందిస్తామన్నారు.

వారిపై ఉన్న రివార్డును కూడా వారికి అప్పగిస్తామని వెల్లడించారు. ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని ప్రయోజనాలు వారికి అందేలా చూస్తామన్నారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, రూరల్ సీఐ అఫ్జలొద్దీన్, తాళ్లగురిజాల ఎస్‌ఐ రమేశ్,​ సిబ్బంది పాల్గొన్నారు.